ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పధకం ప్రారంభమైంది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys jagan) తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. మద్య తరగతివర్గాలకు సైతం ఇళ్ల స్థలాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రారంభించారు.
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. లబ్దిదాదురలకు ఎలాంటి వివాదాలు, లిటిగేషన్లు లేని క్లియర్ డాక్యుమెంట్ తోమార్కెట్ కంటే తక్కువ ధరకే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తమని ఆయన అన్నారు. మధ్యతరగతి ప్రజలకు అన్ని వసతులు ఉన్న స్థలాలిస్తామన్నారు. ఈ పథకంలో మూడు కేటగిరీల్లో 150 గజాలు, 200 గజాలు, 240 గజాలల్లో ప్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం తెలిపారు, మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి, కడపజిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లే అవుట్లు వేశామన్నారు.
ఆసక్తి కలిగిన, అర్హులైన వ్యక్తులు https://migapdtcp.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఇవాళ్టి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇందులో పది శాతం ప్లాట్లను కేటాయిస్తున్నారు. 20 శాతం తగ్గింపు ధర ఉంటుంది. ప్లాట్ ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించవచ్చు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన లే అవుట్‌లో 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు , నాణ్యమైన మౌళిక సదుపాయాలు ఉంటాయి. తొలి విడతలో 3 వేల 894 ప్లాట్లను సిద్ధం చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) తెలిపారు.
రూ.18లక్షల వార్షికాదాయం ఉన్నవారు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ప్లాట్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని జగన్ ప్రకటించారు. ప్లాట్లకు అయ్యే నగదును నాలుగు వాయిదాల్లో ఏడాదిలోగా చెల్లించే అవకాశం కల్పిస్తామన్నారు. చివరి వాయిదా చెల్లింపు పూర్తైన వెంటనే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. తొలి వాయిదాలో 10శాతం, అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30 శాతం, ఆరు నెలల్లోపు 30శాతం రిజిస్ట్రేషన్ చేసుకునేనాటికి అంటే ఏడాది లోపు మిగిలిన మొత్తం చెల్లిస్తే పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. ఒకేసారి పూర్తి మొత్తం చెల్లిసే 5శాతం రాయితీ ఇస్తామని జగన్ ప్రకటించారు.